Sunday, July 27, 2014

 

ఇది శ్రీకాంత్ 'శంక' రా, శంకరా..!

Hi All,
Greetings...

ఇది నా మదిలో ఇటీవల కలిగిన దైవాంశ శంక, నా గతిలేని మతికి తగిలిన డొంకతిరిగిన వంక...



దేవునిగా పూజింపబడే కృష్ణునికి జన్మనిచ్చిన తండ్రి అయిన వసుదేవుడంతటివాడే కన్న కొడుకు కోసం ఒక గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అని పురాణం.
పుట్టే కొడుకు కారణజన్ముడని తెలిసి కూడా వసుదేవుడు తన బిడ్డకు కించిత్ ప్రమాదం అయినా కలుగరాదు అని ఆ చర్యకు ఉపక్రమించాడా?
ఆకాశవాణి చెప్పిన భవిష్యవాణి తప్పు అవుతుందేమో అన్న సంశయంతో మానవమాత్రుడు కనుక మనసున శంకతో కొంత జంకి కార్యమొనర్చాడా?
జీవాలన్నింటిలోనూ దేవుడు ఉంటాడని భావించి తన కొడుక్కి ఎటువంటి హాని కలుగకుండా చూడమని ఆ ఖరము (రూపంలో దైవం) కాళ్ళకు మోకరిల్లాడా?
కనీసం ఇప్పుడు కలిగిన పుత్రుడైనా క్షేమంగా జీవించి తనకు అంత్యక్రియలు జరిపి పున్నామ నరకం దాటిస్తాడన్న ఆశతో, అది జరిగాలన్న అభిలాషతో గార్ధబం పాదాలకు నమస్కరించాడా?
సర్వజ్ఞాని అయినటువంటి దైవాంశ సంభూతుడైన కృష్ణుడు ఏదో నీతి చెప్పదలచి, లేక ఒక తండ్రి ప్రేమకు హద్దులుండవని, పిల్లల సంతోషంతో పోటీకై పరుల మాటలు, పరువు పట్టింపులుండవని తెలుపదలచి, తన తండ్రిచే ఈ పనిని జరుగనిచ్చాడా?

శంకరా... ఇది ఏమి 'శంక' రా..!

పిలిచిన పలికే, తలచిన నిలిచే, కొలిచిన కాచే దైవమని కీర్తింపబడు కృష్ణున్ని కన్న బిడ్డవలె కన్నుల్లో పెట్టుకొని వెన్నతో పెంచుకున్న తల్లి యశోద అని చెబుతుంది భాగవతం.
మరి అటువంటి తల్లిని లోకకళ్యాణం కోసమని వదిలి వెళ్ళిన కృష్ణుడు అధికారికముగ చేసుకున్న ఎనిమిది కళ్యాణ వేడుకలలో ఒక్కదానికి కూడా తనను సంప్రదించకపోవడం, తన చేతుల మీదుగా ఒక్క పెళ్ళిని కూడా జరుగనివ్వకపోవడం - ఎంతవరకు సహేతుకం? దేనికది సంకేతం?
కొడుకుపై ప్రేమతో అతని రాకకై ఆశతో వేచి వేచి, తన ఆనందంలో, సంతోష సమయంలో పాలుపంచుకోవాలన్న కోరికను చివరకు మరుజన్మలో తీర్చుకున్న యశోదామాతది కేవలం మాతృహృదయమా? హద్దులేని ఔదార్యమా? లేక తెలియని అపరాధ ఫలమా? ఏది కారణం?
లేక తల్లి మనసును, తన ఔచిత్యాన్ని మానవులు తెలుసుకునేందుకు జగదోద్ధారకుడైన, లోకరక్షకుడైన కృష్ణుడు కోరి ఇటువంటి విధి కల్పించాడా? జీవితంలో ముఖ్యఘట్టమైన తన పిల్లల కళ్యాణవేడుకలో పాలుపంచుకోకపోయినా, ఒక తల్లి కేవలం వారి సంతోషాన్ని కాంక్షిస్తుందని, పిల్లలపై తల్లికి ప్రేమే తప్ప కోపం ఉండదని వారి సుఖం కోసమే జీవితాంతం తపిస్తుందని చెప్పదలచి ఇలా జరుగనిచ్చాడా?

ఏది ఏమైనా, దైవం తలచిన కొన్ని కార్యాలకు, తల్లిదండ్రుల కొన్ని కర్మలకు సరైన కారణాలు కనపడవు. అనుకున్నామని జరుగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని; జరిగేవన్నీ మన మంచికని, తలపోయడమే మనిషి పని... తల్లిదండ్రులను కొలవడమే మన ధర్మమని... మాతృదేవోభవ, పితృదేవోభవ...

Happy Parents' Day... Internationally Parents' Day is celebrated on the fourth (4th) Sunday of July, every year.

With thanks, regards and best wishes,
Kanth.

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]