Tuesday, November 20, 2018

 

స్వామియే శరణం అయ్య(య్య)ప్ప..!

          ఇది కేవలం నా గమనిక, అనుభవాల నుండి వచ్చిన తలపు తప్ప, ఇతరులను తక్కువ చేయాలనుకునే తప్పు కాదు. ఏదేని కారణం చేత ఎవరినైనా నొప్పించినచో అందుకు మన్నించమని మనవి.

ఎన్నో తరాలుగా నిరంతరంగా సాగుతున్న శబరిమల అయ్యప్ప దేవుని కొలిచే ఆచారం, మాల ధారణం. ఈ దీక్షలో భాగంగా భక్తులు ఇంద్రియ నిగ్రహంతో వస్తువ్యామోహం విడిచి శ్రద్ధగా నియమ నిష్ఠలతో తమ రోజూవారి పనులను చేస్తూ పూజాకార్యక్రమాలు నిర్వహిస్తూ కోపాలను, కోరికలను నియంత్రించుకొని పాపాలను నిర్జించుకొని పుణ్యకార్యాలు నెరవేరుస్తూ నిరాడంబరంగా ఉంటారు. ఉండాలి.. ఉండేలా చూసుకోవాలి. చిత్తశుద్ధిలేని పూజలు ప్రతిఫలం ఇవ్వవని లోకోక్తి. మరి ఈ కాలంలో ఎలా ఉన్నది భక్తి?

మాలను ధరించి, దీక్షను స్వీకరించి, మడిబట్టను కట్టి, ఇరుముడిని పట్టి... వీటన్నింటినీ స్వీయచిత్రం (సెల్ఫీ) తీసి ఫేసుబుక్కులో, వాట్సాపులో, ట్విట్టరులో పెట్టి... ఇదేమి భక్తి స్వామి అని ముక్కున వేలెట్టే లాగా ఉన్నది. ఇదేనా దీక్షా దక్షత? ఇదేనా మాల పవిత్రత? ఇదేనా ఇరుముడికి సార్ధకత? ఇదేనా భక్తి ప్రపత్తత? ఎటువైపుగా పురోగమిస్తుందో ఈ ప్రస్తుత సమాజం అని ప్రశ్నించుకునే సమయం ఇది అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. ఇది పురోగమనమో లేక తిరోగమనమో అని అనుమానం కలుగక మానదు మ్రాన్పడే మానవునికి, మధనపడే మనసుకి.

గురుస్వాములు, వేదమూర్తులు, సదాచారులు, పండితపురుషులు, ఇవి గమనించి... సామాన్య ప్రజలకు సరి అయిన ఆలోచనలు, విరివిగా అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా తెలియచెప్పే ప్రయత్నము చేయాలి. వీలైతే సూక్తి నియమావళిలో నిజమైన భక్తి మార్గాన్ని పొందుపరిచి బోధించాలి.

ఈ వింత పోకడ మరింతగా ముందుకు పోకమునుపే జనులు మేలుకొని గ్రహించాలి. లేకున్న యెడల స్వామియే శరణం అయ్యప్ప అను స్మరణం కూడా తప్పైపోయే ప్రమాదం ఉన్నది. వైపరీత్యాలు జరిగి అయ్యయ్యప్ప అని బాధపడే రోజులు రాకుండా జాగ్రత్త పడాలి. ఆ అయ్యప్ప స్వామి అందుకు అందరినీ, వీలైతే అదిలించి ముందుకు కదిలించాలి. ఆయన ఆశీస్సులు అందరిపై ఉండాలి. అందరికీ సదా మంచి జరగాలి.

శుభం భూయాత్...

- ఇట్లు శ్రీకాంత్.

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]