Sunday, May 10, 2009

 

అమ్మకు అక్షరార్చన....

Hello All,
అమ్మ - అమ్మాయి దశ నుంచి ఆమెగా మారి అమ్మై తన, తనవారి జన్మలను సార్థకంచేయు ప్రతి తల్లికి తలను వంచి అభివాదం చేస్తున్నాను. అమ్మగా మారే ప్రతి స్త్రీ, ఆదిశక్తిగా మారే విధం, వింటే ఆసక్తికరం. పుట్టినప్పుడు ఇంట మహాలక్ష్మిగా, పెళ్ళితో నరేశ్వరునికి అర్ధాంగి పార్వతిగా, పిల్లలకు తొలి గురువు సరస్వతిగా - అమ్మగా మారే వ్యక్తి, త్రికరణశుద్ధిగా త్రిశక్తి రూపం. అందుకే గర్భవతి అయిన అతివ గర్భగుడిలో దేవతతో సమానం అంటారు. మాతృమూర్తిగా మారి, మాతృదేవతగా భావింపబడి, "మాతృదేవోభవ"గా కీర్తింపబడు అమ్మలకు, మాతృదినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ ఈ పదాంజలి ఘటిస్తున్నాను.
జీవితాన అక్షయమౌ అనురాగపు తొడుగు - అమ్మ
జగతికి రక్షణగా మను ఆకాశపు గొడుగు - అమ్మ
జీవికి తన ఊహ తెలిపే తొలి అడుగు - అమ్మ
జీవన తోవన బాధ్యత తెలిపే పెళ్ళి ఒడుగు - అమ్మ
స్వఛ్ఛమైన తామరలు వికసించే మంచి మడుగు - అమ్మ
మచ్చపడ్డ మదిపొరలను మంచులా కడుగు - అమ్మ
ఎల్లరుల క్షేమాన్ని కోరుతూ, కుశలమునడుగు - అమ్మ
పిల్లలలో నలుపు, తెలుపు తేడా చూడని వేలుపు - అమ్మ
అంచలా మంచి, చెడుల వివేక వివేచన తెలుపు - అమ్మ
కాంచగా ఎల్లెడలా మన పయనాన మేలు మలుపు - అమ్మ
ఎంత పనికైనా ఎప్పుడూ ఎరుగదు అలుపు - అమ్మ
సొంతవారికై ఆసాంతం ఆలోచన సలుపు - అమ్మ
కుటుంబాన అందరినీ ఆనందంగా కలుపు - అమ్మ
బ్రహ్మాండాన అన్నింటికన్న కమ్మనైన పిలుపు - అమ్మ

అమ్మకు సాటి అమ్మనే ఈ సువిశాల ప్రపంచాన...
అమ్మలపర్వదినాన, తనకు అందిస్తున్నా ఈ అక్షరార్చన....
Best wishes for a “Happy Mother’s Day”....
Many many happy returns of the day.
All the best and take care….
With thanks, regards and best wishes,
G.Srikanth.

Comments:
శ్రీకాంత్ గారూ,
అమ్మ గురించి మీరు రాసిన కవిత చాలా బావుంది.
 
కవిత బాగుంది.
 
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది . మీ కవిత బావుందండీ !
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]